తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవాసదన్ 1 మరియు 2 భవనాలను శుక్రవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవో రెండు భవనాలను క్షుణ్ణంగా పరిశీలించి, తిరుమలలో వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల నమోదు, లాకర్లు, స్కార్ఫ్‌లు, బెడ్‌లు మరియు డ్యూటీల కేటాయింపు, ఆలయ విధులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్, సత్సంగం, ధ్యానం, భజన కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం శ్రీవారి సేవాసదన్ -2 లోని జీడిపప్పు వలుచు హాల్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. తరువాత సేవా సదన్‌లలో పరిశుభ్రత, శ్రీ మలయప్ప స్వామివారి సేవకుల వసతి, అన్నప్రసాదం, దర్శనం తదితర సౌకర్యాలను ఈవో, అదనపు ఈవో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం శ్రీవారి సేవకులతో టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి సేవకులు తమకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే తిరుమలలోని పరకామణి భవనాన్ని సైతం టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా హుండీల తరలింపు, నాణేలు, కరెన్సీల విభజన ప్రక్రియ, పరకామణి లెక్కింపు, లెక్కింపు ప్రక్రియ, డ్రెస్ కోడ్‌లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. తరువాత ఈవో సీసీటీవీ గదిని కూడా పరిశీలించారు. అంతకుముందు కట్టుదిట్టమైన భద్రత నడుమ తిరుమల ఆలయం నుంచి పరకామణి భవనానికి హుండీల తరలింపు ప్రక్రియపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం తిరుపతి పరకామణి, పరకామణి సేవకులు, ఉద్యోగులతో పాటు బ్యాంకు అధికారులతో చర్చించారు. హుండీల్లో బంగారం, ఇతర విలువైన వస్తువులు, విరాళాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, ఇతర సంబంధిత సమాచారాన్ని ఈవోకు వివరించారు.