
ఎప్పుడూ కూడా భాగవతాన్ని వింటున్నాననో లేదంటే చదువుతున్నాననో అనుకోకూడదట. మరి ఏమనాలి? అంటారా? ‘పిబత భాగవతం’(భాగవతాన్ని తాగండి) అనాలని భాగవతులు చెబుతారు. వినేదాన్నో లేదంటే చదివేదాన్నో తాగడం ఎలా కుదురుతుంది అంటారా? దీని పరమార్థం వేరే ఉంది. ఏదైనా తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో ఉన్నా ఆ పదార్థాన్ని నోరు నేరుగా కడుపులోకి పంపిస్తుంది. ద్రవంలో సాధారణంగా తీసిపారేసేది ఏదీ ఉండదు. ఆ దృఢమైన నమ్మకంతో రెండో ఆలోచన లేకుండా తాగేస్తాం.‘భాగవతమూ అలాంటిదే. దాన్ని రచించినప్పుడే అనేక వడపోతలు జరిగిపోయాయి.
భక్తులు,భగవంతుల కథలు కాబట్టి, వాటివల్ల అనేకమందికి మార్గదర్శనం అవుతుంది కాబట్టి దీనిలో తీసి పారేయవలసింది ఏదీ ఉండదు’ అని వేదాంత ప్రవచనకర్తల మాట. భాగవతంలో భగవంతుడు శబ్దరూపిగా వసించడమే అందుకు కారణం. కాబట్టి భావంతో సంబంధం లేకుండా గా(పా)నం చెయ్యవచ్చు. ‘తెలుగు భాషకు ముగ్గురు మకుటంలేని మహారాజులు ఉన్నారు. వారు వరసగా- త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. వీరి ముగ్గురి పేర్లలో రాచరికం ఉంది. కానీ వీరు ముగ్గురూ భగవంతుణ్ని సేవించి, ఆ సేవల్లోని మాధుర్యాన్ని గ్రోలి (తాగి), ఆ రుచి మరిగి ‘ఈ రాచరికం వల్ల ఏమీ సుఖంలేదు. కాబట్టి మాకు వద్దు’ అని విడిచిపెట్టేశారు.
