ఆధ్యాత్మికంగా చూస్తే ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలు అయితే, దక్షిణాయన పుణ్యకాలం దేవతలకు రాత్రి సమయమని చెప్పుకున్నాం. కాబట్టి దక్షిణాయన కాలంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడట. కాబట్టి దక్షిణాయన సమయంలో మానవులకు దైవ శక్తి అంతగా ఉండదట. దైవ శక్తి లేనిదే మానవ మనుగడ అనేది సాగదు. కాబట్టి దక్షిణాయన కాలంలో ఉపాసకులు దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఉపాసనలు చేస్తారు. ఈ తంతగమంతా వివిధ పండుగల రూపంలో జరుగుతూ ఉంటుంది. అందుకే ముఖ్యమైన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి.
ఇక శ్రీ మహా విష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నాలుగు నెలల సమయంలోనే చాతుర్మాస దీక్షను చేపడుతూ ఉంటారు. అలాగే దక్షిణాయనంలో ఉపాసనలు చేపట్టడానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. భూమిపై దక్షిణాయన కాలం అంటే ఆరు నెలల పాటు సూర్యకాంతి తగ్గుతుంది. దీంతో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. ఈ వ్యాధుల దరి చేరకుండా ఉండేందుకే ఉపాసనల పేరిట ఆహార నియమాలు, ఇతర ఆంక్షలతో శరీరానికి ఉత్తేజం కలిగిస్తారు. అప్పుడు మాత్రమే మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ సమయంలో చాతుర్మాస దీక్ష పేరిట పాటించే బ్రహ్మచర్యం, పూజలు, వ్రతాలు, భగవత్ ఉపాసన వంటివి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని చెబుతారు.