ఎముకలకు పూజ చేసే ఆలయం ఎక్కడుందో తెలుసా?

ఉత్తరాఖండ్ అందమైన దృశ్యాలకే కాదు.. ఆధ్యాత్మికతకు సైతం నెలవైన ప్రాంతం. ఇక్కడ ఎన్నో గొప్ప గొప్ప ఆలాయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో చెప్పుకోదగినది కార్తీక స్వామివారి ఆలయం. ఇది ఎత్తైన శిఖరంపై ఉంటుంది. ఈ ఆలయం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలోని రుద్రప్రయాగ పోఖారి రహదారిపై కనక్ చౌరి గ్రామ సమీపంలో 3050 మీటర్ల ఎత్తులో క్రాంచ్ కొండపై ఉంది. ఈ ఆలయంలో శివపార్వతుల తనయుడు కార్తికేయ స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ కార్తికేయుడు బాలుని రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఇక ఈ ఆలయం మేఘాలలో తేలియాడుతున్నట్టుగా ఉంటుంది.

పురాణాల ప్రకారం మనకు బాగా తెలిసిన ప్రాచుర్యంలో ఉన్న కథ ఒకటి ఉంది. అదేంటంటే.. శివుడు తన ఇద్దరు కుమారులను విశ్వం చుట్టూ ప్రదక్షిణ చేసి రమ్మని కోరగా.. కార్తికేయుడు విశ్వానికి ఏడు ప్రదక్షిణలు చేయడానికి బయలుదేరాడు. గణేశుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి తన విశ్వం వారేనని చెప్పాడు. చాలా సంతోషించిన శివపార్వతులు ఇక మీదట తొలి పూజను నీవే అందుకుంటావని గణేశుడిని ఆశీర్వదించారు. తరువాత వచ్చిన కార్తికేయుడు కోపంతో తన మాంసాన్ని, ఎముకలను శివుడికి అర్పించాడట. కాబట్టి ఈ ఆలయంలో కార్తికేయుని ఎముకలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి కార్తికేయుడిని మురుగన్ అని కూడా అంటారు. ఈ ఆలయంలోని గంటల శబ్దం 800 మీటర్ల దూరం వరకూ వినబడుతుందట.

Share this post with your friends