భారతదేశంలో శివాలయం అనేది ప్రతి గ్రామంలోనూ ఉంటుంది. అయితే ఏదైనా కాశీ తర్వాతే.. అక్కడ విశ్వేశ్వరుడిగా స్వామివారు పూజలందుకుంటు న్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని ఓ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. అదేంటో.. దాని కథేంటో తెలుసుకుందాం. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో భూంపల్లి మండలం దుబ్బాక చేరువలో ఉన్న రామేశ్వరం పల్లి గ్రామంలో ఉంటుందీ ఆలయం. ఆసక్తికరంగా ఇక్కడి శివలింగం ఇసుకతో చేయబడింది. ఈ ఇసుక శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. ఈ ఆలయ చరిత్ర వందేళ్ల నాటిదని అంటారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా భక్తులు అభివర్ణిస్తారు.
ఈ క్షేత్ర చరిత్ర విషయానికి వస్తే.. శ్రీరామడు రావణ సంహారం అనంతరం ఆ దోష నివారణ కోసం అగస్త్య ముని సలహా కోరాడట. ముని సూచన మేరకు శివుణ్ణి పూజించదలచి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడినికి చెప్పగా.. ఆయన రావడం ఆలస్యం కావడంతో ఇసుక లింగాన్ని చేసి పూజ చేశాడని చెబుతారు. అయితే కూడవెల్లి వాగు వద్ద రామయ్య సైకత లింగాన్ని ప్రతిష్ట చేసి పూజిస్తున్న సమయంలో కాశీ నుంచి లింగాన్ని తీసుకుని హనుమంతుడు వచ్చాడట. అక్కడ మరో లింగాన్ని చూసి ఆంజనేయుడు కలత చెందాడట. అప్పుడు హనుమంతుడితో శ్రీరాముడు బాధపడవద్దని తొలి పూజ నీవు తెచ్చిన లింగానికే చేస్తానని చెప్పాడట. ఆ తరువాతే సైకత లింగాన్ని పూజిస్తానని వరమిచ్చాడట. అప్పటి నుంచి ఆలయంలో రెండు లింగాలు దర్శనమిస్తాయి.