కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో వివాహమాడారు. వెంటనే స్వామివారు తిరుమలకు రాలేదట. కొన్ని ప్రాంతాల్లో సంచరించి ఆ తరువాత తిరుమలకు వచ్చాడట. అలా సంచరించిన వాటిలో అప్పలాయగుంట కూడా ఒకటని చెబుతారు. మరి సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామివారు నివసించిన అప్పలాయగుంట విశేషాలేంటో చూద్దాం. అప్పలాయగుంటలో భక్తులను స్వామివారు చాలా ప్రసన్నంగా భక్తులను అనుగ్రహించారట కాబట్టి ఇక్కడి స్వామికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పేరు.
శ్రీ మలయప్ప స్వామివారు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని నారాయణవనంలో వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరారట. అయితే దారిలో పలు చోట్ల ఆగారట. అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామి వారిని అభయహస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. ఆ తర్వాత అప్పలాయగుంట నుంచి బయలుదేరి కాలినడకన వెళుతూ స్వామివారు తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించారట. ఆ తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఆరు నెలలు ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరాడని స్థల పురాణం.