హిందువులు దేవుళ్లను పూజించేటప్పుడు చాలా నియమాలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా విరిగిన విగ్రహాలను లేదా చిత్ర పటాలను పూజించడం నిషేధం. అయితే ఈ నిబంధన ఒక ప్రాంతంలో మాత్రం వర్తించదు. ఇక్కడ విరిగిన విగ్రహానికి ఒకటి కాదు రెండు కాదు.. కొన్ని వందల ఏళ్లుగా పూజలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సుమారు 300 సంవత్సరాలుగా విరిగిన శివలింగాన్ని పూజిస్తున్నారు. ఈ శివలింగాన్ని గాయపడిన మహాదేవుడు లేదా వృద్ధ మహాదేవుడి పేరిట భక్తులంతా పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
ఈ ఆలయం17వ శతాబ్దం కాలం నాటిది. ఘాజీపూర్‌లోని మొఘల్‌పురా ప్రాంతంలో గంగా నది ఒడ్డున ఉందీ ఘయల్ మహాదేవుడి ఆలయం. ఆలయ గర్భగుడిలో కొలువైన శివయ్య సగం విరిగిపోయి మరీ కనిపిస్తాడు. 17వ శతాబ్దంలో మొఘలుల పాలన కొనసాగుతోంది. ఒక రోజు ఒక రైతు ఆ ప్రాంతంలో వ్యవసాయ పనుల నిమిత్తం పారతో భూమిని తవ్వుతుండగా.. ఏదో గట్టి వస్తువు తగిలిందట. అంతేకాదు ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో పాటు ఆ ప్రదేశమంతా రక్తపు ధార ప్రవహించిందట. వెంటనే రైతు మట్టిని తొలగించి చూడగా శివలింగం కనిపించిందట. శివలింగానికి పై భాగం నుంచి పార తగలడంతో రక్తం కారుతోందట. అక్కడున్న వారంతా భయపడిపోయారట. రైతుకు రాత్రి కలలో శివయ్య కనిపించి అక్కడ ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. ఊరి వాళ్లంతా కలిసి ఆలయాన్ని నిర్మించారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఈ శివయ్యను దర్శించుకుంటూ ఉంటారు.