హనుమంతుడు తన కుమారుడితో ఉన్న ఆలయం ఎక్కడుందో తెలుసా?

హనుమంతుడికి ఓ కుమారుడున్నాడని తెలుసుకున్నాం. ఆ కుమారుడి గురించి ఆంజనేయుడికి తెలియదట.. మైరావణుడి చెర నుంచి రామలక్ష్మణులను విడిపించే తరుణంలో తన కుమారుడితోనే యుద్ధం చేశాడట. ఆ తరువాతే తన కుమారుడు మకరధ్వజుని గురించి ఆంజనేయడికి తెలిసిందట. ఇక తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఓ ఆలయంలో పూజలు అందుకుంటున్నారు. ఆ ఆలయమేంటో చూద్దాం. గుజరాత్‌లోని ద్వారకకు నాలుగు మైళ్ల దూరంలో బెట్ ద్వారకా హనుమాన్ దండి ఆలయం ఉంది. ఈ ఆలయంలోనే తండ్రీకొడుకులిద్దరూ కలిసి పూజలందుకుంటున్నారు. ఈ ఆలయ చరిత్ర ఈనాటిది కాదు. సుమారు 500 సంవత్సరాల నాటిదని చెబుతారు. పైగా హనుమంతుడు తొలిసారిగా తన కుమారుడు మకరధ్వజుడిని ఇక్కడే కలిశాడట.

ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే హనుమంతుడితో పాటు మకరధ్వజుడు సైతం మనకు దర్శనమిస్తారు. వీరిద్దిర ప్రతిమలు చూసేందుకు చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. వీరిద్దిరి చేతిలోనూ ఎలాంటి ఆయుధాలూ కనిపించవు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ రెండు విగ్రహాలను ప్రతిష్టించిన సమయంలో మకరధ్వజుడి విగ్రహం తండ్రి విగ్రహం కంటే చాలా చిన్నదట. ఇప్పుడు తండ్రి విగ్రహంతో సమానంగా పెరిగిందట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలు.. తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి విభేదాలున్నా సమసిపోతాయని నమ్మకం. అలాగే తండ్రీకొడుకుల మధ్య అప్యాయతానురాగాలను కలకాలం నిలిచేలా ఈ ఆలయం చేస్తుందట.

Share this post with your friends