
ఏపీలోని సూళ్లూరుపేట గ్రామదేవత చెంగలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయం గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ ఆలయానికి తలుపులుండక పోవడం ఒక ఆసక్తికరమైతే ఈ ఆలయ స్థల పురాణం మరో ఆసక్తికరం. అప్పట్లో కొంతమంది పశువుల కాపరులు పశువులు మేపే క్రమంలో అక్కడి కాళంగి నదిలో స్నానానికి దిగారట. అప్పుడు ఒక పశువుల కాపరి నీటి సుడిగుండాల్లో చిక్కుకున్నాడట. అప్పుడు మిగిలిన వారు భగవంతుడిని వేడుకున్నారట. ఆ వెంటనే సుడిగుండంలో చిక్కుకున్న కుర్రాడికి ఏదో బండరాయి తగిలిందట.
ఆ వెంటనే ఆ కుర్రాడు బండరాయిని గట్టిగా పట్టుకున్నాడట. దీంతో ఇద్దరూ ఒక్కసారిగా వచ్చి ఒడ్డున పడ్డారట. కానీ కుర్రాడు స్పృహ కోల్పోయాడట. మెలుకువ వచ్చిన తర్వాత చూస్తే తన పక్కనే అమ్మవారి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడట. ఈ సమాచారం గ్రామస్తులకు అందడంతో అంతా నది వద్దకు వచ్చి చూశారట. అమ్మవారి ముఖం దక్షిణ ముఖంగానూ.. నిటారుగానూ కనిపించిందట. వెంటనే గ్రామస్తులు ఆ విగ్రహాన్ని కదిలించేందుకు ఎంత యత్నించినా జరగలేదట. దీంతో అమ్మవారి విగ్రహాన్ని అక్కడే పెట్టి నిత్య పూజలు చేయడం ఆరంభించారట. ఆ తరువాత చిన్నపాటి గుడి కట్టారట. నీటి సుడిలో దొరికిన అమ్మవారు కాబట్టి సుళ్లూరు అమ్మవారని నామకరణం చేశారు.
