
‘కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపః’ అని అంటుంటారు. దీని అర్థమేంటో తెలియాలంటే ఒక కథ తెలుసుకోవాలి. ఒక సాధువు సంసారం మీద విరక్తితో ఊరి బయట ఒక పాక వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఊరి ప్రజలు తనకు సమర్పించే పళ్ళు తిని పాలు మాత్రం తాగి జీవిస్తూ ఉండేవాడు. అతనికి రెండు కౌపీనాలు (గోచీలు) మాత్రమే ఉండేవి స్నానం చేసి ఒకటి ఆరేసుకునే వాడు ఒకటి కట్టుకునే వాడు. కొన్నాళ్ళకు ఒక ఎలుక ఆ కౌపీనాన్ని రోజు కొరికి వేయసాగింది. ఎన్ని కౌపీనాలు మార్చినా అలాగే కొరికేస్తూ ఉండేది. గ్రామస్తుడొకడు ఆ సాధువుకు ఒక పిల్లిని యిచ్చి దీనివలన మీకు ఎలుక బాధ ఉండదు స్వామీ అని చెప్పాడు. మరి ఆ పిల్లికి పాలు పొయ్యాలి కదా! గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవును కొనిచ్చారు.
ఆ ఆవు పాలు పీతికేందుకు దానిని అడవికి తీసుకొని పోయి మేపుకొని వచ్చేందుకు మనిషి కావాలి కదా! ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతమివ్వాలి. అందుకని గ్రామస్తులు అతన్ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అమ్మాయిని కూడా చూపించారు. అతను పెళ్లి చేసుకున్నాడు. భార్య గోచి బాగాలేదు పంచె కట్టుకోండి అని అన్నది. సరే పంచెలు కొన్నాడు. బిడ్డలు పుట్టారు. వాళ్ళను పోషించేందుకు డబ్బు కావలసి వచ్చింది. గ్రామస్తులతో మాట్లాడి ఒకరి పొలాన్నికౌలుకు తీసుకుని సేద్యం చేయసాగాడు. తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. సొంతంగా పొలం కొనుకున్నాడు. ఎద్దులు కొన్నాడు. సంసారం పెరిగి పోయింది. ధ్యానం, తపస్సు వెనకబడి పోయాయి. డబ్బు యావ పెరిగి పోయింది. ధ్యానం బదులు ధాన్యమే ముఖ్యమైంది. శాంతికరువైంది. ఇది ఇలా వుండగా ఒకసారి అతని గురువు అతన్ని చూడటానికి వచ్చాడు.
ఆయన ఇదంతా చూసి ఆశ్చర్యపోయి ఇదేమిటిరా నేను చెప్పిందేమిటి? నీవు చేసిందేమిటి? అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు గురుదేవా! “కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపః” అన్నాడు. గురుదేవా! నా గోచిని కాపాడుకోవడానికి ఇంత పటాటోపం పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి నాకు బుద్ధి వచ్చింది అని లెంపలు వేసుకొని ఆ సంపాదనంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్లిపోయి హయిగా కంద మూలాదులు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతిగా గడిపాడట…
ఈ సామెత వెనుక ఇంత కథ ఉంది. అప్పటి నుంచి లోకంలో “కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపః” అనే సామెత వచ్చింది.
