తిరుప్పావై అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే 30 పాశులరాల గురించి.. వాటిలో ఏముందో కూడా తెలుసుకున్నాం. పాశురాల గురించి తెలుసుకోవడమంటే గోదాదేవి గురించి.. ఆమె రాసిన పాట గురించి తెలుసుకోవడమే. ఈ క్రమంలోనే ఒక్కో పాశురంలో ఏముందనేది కూడా తెలుసుకున్నాం. సాధారణంగా ఆలయాలలో అమ్మవారికి, స్వామివారికి విడివిడిగా మాలలు వేస్తారు. కానీ ఈ ఆలయం అంటే శ్రీవిల్లిపుత్తూర్ ఆలయంలో మాత్రం అమ్మవారు ధరించిన మాలనే స్వామికి కూడా వేస్తారు. అసలు ఆ ఆలయం ఎక్కడుంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం.
తిరుప్పావై ప్రత్యేకం శ్రీవిల్లి పుత్తూరు క్షేత్రం. ఇది 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. ధనుర్మాసంలో జరిగే తిరుప్పావై సందర్భంగా మహిమాన్వితమైన శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయ విశేషమేంటంటే.. ఆలయ శిల్పకళా సౌందర్యం చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఎత్తైన రాజ గోపురాలు, భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచే ఆండాళ్, రంగనాయక స్వామి విగ్రహం ఇవన్నీ ఈ ఆలయ ప్రత్యేకతలు. ఈ ఆలయంలో మరో విశేషమేమిటంటే.. ఇక్కడ వటపత్రశాయి శ్రీదేవి భూదేవితో కలిసి కొలువు తీరింది. ఈ ఆలయాన్ని దర్శిస్తే అవివాహితులకు వెంటనే వివాహం జరుగుతుందని విశ్వాసం.