భర్తతో అరణ్యవాసమైనా అయోధ్యలా భావించి అడవులకు వెళ్లిన సీతమ్మ గురించి మనకు తెలిసిందే కానీ భర్త తోడు లేనిదే అయోధ్యను సైతం అరణ్యంలా భావించి జీవించిన ఊర్మిళ గురించి మాత్రం కొందరికే తెలుసు. ఊర్మిళ త్యాగనిరతి.. ఆమె ఔన్నత్యం పెద్దగా బయటకు రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే సీతాదేవి ప్రాభవం మాటున మరుగున పడిపోయింది. సీతారాముల పట్టాభిషేకం వార్త విని ముందుగా సంతోషించింది ఊర్మిళాదేవియేనట. అదే ఆనందంతో ఆమె అంత:పురంలో ఉండగా భర్త లక్ష్మణుడు అక్కడకు వచ్చాడట. ఆయన రాకను గమనించని ఊర్మిళ ఉలిక్కిపడుతుందట.
కైకమ్మ వలన అన్న పట్టాభిషేకం క్యాన్సిల్ అయిన విషయం చెప్పి తల్లడిల్లిపోయాడట లక్ష్మణుడు. అనంతరం తాను అన్నావదినల సేవకోసం అడవులకు వెళుతున్నానని భార్యకు చెప్పాడట. ఆమె భర్తను వెళ్లకుండా ఆపలేదు సరికదా.. తానూ వెంట వస్తానని పట్టుబట్టనూ లేదట. మీ అన్నావదినల సేవలో తరించాలని సూచించిందట. ‘అయితే మీరు వనవాస కాలంలో ఒక్క క్షణం తన గురించి ఆలోచించినా కూడా తన మనసు చలిస్తుంది.. తద్వారా మీ సేవకు ఆటంకం కలగవచ్చు కాబట్టి నా గురించి క్షణ కాలమైనా ఆలోచించకండి’ అని ఊర్మిళ భర్తకు చెప్పిందట. పైగా వారంతా అడవులకు వెళుతున్నా కూడా ఊర్మిళ బయటకు రాలేదట.