తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం ఇవాళ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ జ్యేష్టాభిషేకాన్నే అభిధ్యేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. మొదటి రోజున మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేస్తారు. స్వామివారు వేంచేసిన అనంతరం.. శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహిస్తారు. ఇక జ్యేష్ఠాభిషేకం శుభసందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు శత కలశ తిరుమంజనం కన్నుల పండుగలా జరుగుతుంది.
జ్యేష్టా నక్షత్రంతో ముగిసే జ్యేష్ఠాభిషేకం రోజు రాత్రి పౌర్ణమి ఘడియలు ఉంటే ఆ రోజు శ్రీవారి పున్నమి గరుడ సేవ కూడా కమనీయంగా జరుగుతుంది. అయితే భక్తులు తెలుసుకోవల్సిన విషయం ఏంటంటే.. ముఖ్యంగా ఈ గరుడ సేవ చూసిన వారికి అష్టైశ్వర్యాలు తప్పక సిద్ధిస్తాయట. ఇక జ్యేష్టాభిషేకం ముగిసిన అనంతరం స్వామివారు, ఉభయ దేవేరులకు బంగారు కవచం అలంకరిస్తారు. ఈ బంగారు కవచంలోనే వచ్చే ఏడాది వరకూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను దర్శించుకుంటే ఇహ లోకంలో సకల సౌఖ్యాలు పొందుతారట. అలాగే వైకుంఠాన్ని చేరుతారని పండితులు చెబుతారు.