హిందూ మతంలో పూజించే అత్యంత పవర్ ఫుల్ స్త్రీ దేవతలలో దుర్గాదేవి ఒకరు. అమ్మవారిని చాలా శక్తవంతమైన దేవతగా భావించి కొలుస్తూ ఉంటారు. దుష్ట శిక్షణ చేసి నిత్యం తన భక్తులను దుర్గా మాత రక్షిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారు అమ్మవారిని పూజిస్తే కష్టాలన్నీ తొలిగి పోతాయట. దుర్గమ్మకు 32 నామాలు ఉన్నాయి. ఆ నామాలను స్మరిస్తే కష్టంలో ఉన్న వారిని అమ్మవారు తన చేయి అందించి మరీ బయట పడేస్తుందట.
దుర్గాదేవిని దాదాపు ఎక్కడ చూసినా 8 చేతులతో దర్శనమిస్తుంది. అంటే అమ్మవారిని అష్టభుజ ధారి అంటారు. తన ఎనిమిది చేతులతో అమ్మవారు చెడును నాశనం చేస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి. అయితే అమ్మవారికి 8 చేతులు ఎందుకుంటాయనే సందేహం రావొచ్చు. దుర్గాదేవి 8 చేతులు అష్ట దిక్కులకు ప్రతీకలట. అష్ట దిక్కుల నుంచి నిత్యం అమ్మవారు తన భక్తులను రక్షిస్తూ ఉంటారు. ఇక అమ్మవారి చేతిలో త్రిశూలానికి కూడా ఒక ప్రాముఖ్యం ఉంది. చేతిలోని త్రిశూలం మూడు గుణాలకు చిహ్నం. మొదటిది సత్యం, రెండోది రజో గుణం, మూడోది తమో గుణానికి ప్రతీకలు.