
కొన్ని కథలు మనకు ఎన్నో పాఠాలను చెబుతాయి. అలాంటిదే ఈ కథ. జీవితకాలం భగవత్ చింతనలో ఉండి మరికొద్ది క్షణాల్లో మరణిస్తామనగా.. వేరే విషయాలపైకి దృష్టి పోతే ఉపయోగం ఉండదు. దానికి సంబంధించిన కథనే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఒక ఊరిలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఒక రోజున సత్సంగంలో.. ప్రాణం పోయే సమయంలో భగవత్ చింతన చేస్తే మోక్షం కలుగుతుందని చెప్పడం విని ఇలా ఆలోచించాడు. ‘నా నలుగురి కుమారులకు దేవుని పేర్లు పెట్టుకుని వారిని పిలిచే అలవాటు చేసుకుంటాను. నాకు అంతిమ ఘడియలు వచ్చినపుడు నా కుమారులను ఎలాగూ పిలుస్తాను కదా! ఆ విధంగా నాకు సులభంగా ముక్తి లభిస్తుంది’ అనుకున్నాడు.
కాలం గడుస్తూ ఉంది. కుమారులందరూ పెద్దవారై తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేశారు. వర్తకునికి అంత్యకాలము ఆసన్నమైనది. ఇంక కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుందని వర్తకుడు గ్రహించి వెంటనే ‘ఒరేయ్ రామా!, ఒరేయ్ కృష్ణా!, నాయనా గోవిందా!, నాయనా మాధవా!’ అని అందరిని పేరుపేరునా పిలవసాగాడు. విషయం తెలిసి కుమారులందరూ తండ్రి వద్దకు వడివడిగా చేరుకున్నారు. నలుగురూ ఒక్కసారిగా ‘నాన్నగారూ! ఎందుకు పిలిచారు? మీకెలా ఉంది?” అని అడిగారు. నలుగురూ ఒక్కసారికి తన దగ్గరకు వచ్చేసరికి అతడికి అకస్మాత్తుగా తన దుకాణం గుర్తుకు వచ్చింది. భగవత్ చింతన మరచి.. కుమారులను చూసి చిరాకు పడుతూ ‘పిలిస్తే మాత్రం మీరంతా కట్టకట్టుకుని వచ్చేయడమేనా? అక్కడ మన అంగడి ఏమైపోతుంది?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరణించాడు. ఆఖరి క్షణంలో అతడి ధ్యాసంతా దుకాణం మీదకు పోయింది. జీవితకాలమంతా దైవనామ స్మరణ చేయుట వలన,
అభ్యాసమమవుతుంది. కాబట్టి అంత్యక్షణాల్లో భగవన్నామము పలుకగలమే గాని.. బలవంతముగా యుక్తులతో భగవన్నామము పలుకగలమని ఆనుకోవడం అవివేకం.
