రాక్ ఫోర్ట్ ఉచి పిళ్లై వినాయకుడి కథ తెలుసా?

మనం చెప్పుకోదగిన వినాయకుడి ఆలయాల్లో రాక్‌ఫోర్ట్ ఉచి పిళ్లై ఆలయం ఒకటి. ఇది దేశంలోనే చాలా ప్రఖ్యాతి గాంచిన ఆలయం. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంటుంది. ఈ ఆలయం 83 మీటర్ల రాతిపైన ఉంటుంది. ఈ ఆలయంలో గణేశుడు కొలువుదీరాడు. అయితే గణేశుని ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. లంకా రాజు రావణుడి మరణానంతరం ఆయన సోదరుడు విభీషణుడికి శ్రీరాముడు బహుమతిగా శ్రీ రంగనాథుని విగ్రహాన్ని ఇచ్చాడని రామాయణం పేర్కొంది. అయితే ఇది ఎందుకోగానీ స్వర్గంలోని దేవతలకు నచ్చలేదట. దీంతో అంతా కలిసి వినాయకుడి వద్దకు వెళ్లి విభీషణుడి చేతిలో రంగనాథుని విగ్రహం ఉండకూడదని.. కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ విగ్రహాన్ని అతని నుంచి తీసుకోవాలని కోరారట.

దేవతల కోరిక మేరకు గణేషుడు ఆవు వేషంలో విభీషణుడి దగ్గరకు వెళ్లాడట. ఆ సమయంలో విభీషణుడు కావేరి నదిలో స్నానమాచరించేందుకు సమాయత్తుడయ్యాడు. కానీ విగ్రహాన్ని ఏం చేయాలో తెలియలేదట. ఒకసారి విగ్రహాన్ని నేలపై పెడితే ఇక కదిలించేందుకు అవదు. దీంతో ఎవరికోసమైనా వెదకగా పశువుల కాపరి వేషంలో ఉన్న వినాయకుడు కనిపిస్తాడు. విభీషణుడు వినాయకుడికి విగ్రహాన్నిచ్చి స్నానానికి వెల్లగా వినాయకుడు స్వామివారి విగ్రహాన్ని ఇసుకలో పెడతాడు. అది చూసిన విభీషణుడు బాలుడిని వెంబడించి పట్టుకుని అతని నుదుటిపై కొట్టాడు. ఆ తరువాత అతనే వినాయకుడని తెలుసుకుని క్షమాపణ కోరుతాడు. ఇప్పటికీ అక్కడ వినాయకుడి విగ్రహం నుదుటిపై ఒక చిన్న గొయ్యి మాదిరిగా కనిపిస్తుంది. అలా అక్కడే గణేషుడు కూడా కొలువై పోయాడట.

Share this post with your friends