నూతనంగా పెళ్లైన మహిళలు మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారన్న సంగతి తెలిసిందే. ఇక ఆ వ్రత కథేంటో తెలుసుకుందాం. పూర్వం మహిష్మతీ నగరాన్ని పాలించే జయపాలుడనే రాజుకు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉన్నా కూడా సంతానలేమి వారిని బాధించేది. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా కూడా సంతాన భాగ్యం కలగలేదు. వారి పూజలకు మెచ్చిన భోళాశంకరుడు వారికి సంతాన భాగ్యం కల్పించాలనుకున్నాడు. ఒకరోజు సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి శివుడు వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి ‘భవతీ భిక్షాందేహి’ అన్నాడు. మరెందుకో కానీ జయపాలుని భార్య బిక్ష తీసుకుని వచ్చే లోపే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలా వరుసగా మూడు రోజులు జరిగాక జరిగినదంతా ఆమె జయపాలునికి వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధంగా ఉండు అని జయపాలుడు భార్యకు వివరించాడు.
బంగారు పళ్లెంతో భిక్ష..
భర్త చెప్పినట్టుగానే సన్యాసి రాక ముందే బంగారు పళ్లెంతో రెడీగా మహారాణి నిలుచుంది. శివుడు రాగానే బంగారు పళ్లెంతో సహా భిక్ష ఇవ్వబోయింది. కానీ సంతానం లేని నీ నుంచి భిక్ష స్వీకరించనని శివుడు చెప్పాడు. అప్పుడు శివుడినే సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించమని కోరింది. సరేనన్న శివుడు.. తను చెప్పేది భర్తకు తెలియనివ్వొద్దని ముందుగానే కండిషన్ పెట్టాడు. నీలం రంగు వస్త్రాలు ధరించి.. నీలం రంగు అశ్వంపై ఒంటరిగా తూర్పు దిక్కుకు జయపాలుడిని పంపించమని చెప్పాడు. అరణ్యంలో ఎక్కడైతే నీలాశ్వం అలసటితో కిందపడుతుందో అక్కడ తవ్వితే స్వర్ణ దేవాలయం బయటపడుతుందని చెప్పాడు. ఆ దేవాయలంలోని అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుందని చెప్పి సన్యాసి రూపంలో ఉన్న శివుడు వెళ్లిపోయాడు.
ఆగ్రహించిన గణపతి..
మహారాణి చెప్పినట్టుగానే జయపాలుడు చేశాడు. స్వర్ణ దేవాలయం కనిపించగానే అందులో అమ్మవారికి భక్తితో పూజలు చేశాడు. ప్రత్యక్షమైన అమ్మవారు కోరినంత ధనం ఇస్తానంది. అవేమీ వద్దని తనకు సంతనం భాగ్యం కలిగించమని కోరాడు. అప్పుడు అమ్మవారు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు, వైధవ్యము గల కన్య కావలెనా? అల్పాయుష్కుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది. దీనికి జయపాలుడు తమకు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడు కావాలని అడిగాడు. అప్పుడు ఆ దేవి ‘ఆ రాజుని తన పార్శమున ఉన్న గణపతి నాభి యందడుగు వేసి, ఆ పక్కనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వమని చెప్పింది. అమ్మవారు చెప్పినట్టుగా జయపాలుడు ఒక్క పండు కాకుండా చెట్టుకున్న పండ్లన్నీ కోశాడు. దీంతో గణపతికి కోపం వచ్చి నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పకాటుతో మరణిస్తాడని శపించాడు.
కాశీకి పంపిద్దాం..
కొంతకాలానికి జయపాలుడి దంపతులకు పండంటి బిడ్డ పుట్టాడు. ఆ బాబుకి శివుడు అని పేరు పెట్టుకున్నారు. శివుడు యుక్త వయసు రాగానే వివాహం చేస్తే ఆయుష్షు పెరుగుతుందని భావించి భర్తకు రాణి చెప్పింది. ముందుగా కుమారుడిని కాశీకి పంపిద్దామని.. అక్కడి విశ్వేశ్వరుడిని దర్శించుకున్నాక వివాహం చేద్దామని జయపాలుడు చెప్పాడు. సరేనని మేనమామతో కాశీకి శివుడిని పంపించారు. వీరిద్దరూ మార్గమధ్యంలో ప్రతిష్టానపురంలోని ఓ సత్రంలోకి వెళ్లారు. అక్కడ సుశీల అనే కన్య మరో కన్యతోగొడవపడుతోంది. సుశీలను మరో కన్య ముండ, రండ అంటూ దుర్భాషలాడుతుంది. తన తల్లి మంగళగౌరీ వ్రతం ఆచరిస్తోంది కాబట్టి తమ ఇంట్లో ముండ, రండ ఉండే ఛాన్స్ లేదని సుశీల చెప్పింది.
ఇదంతా విన్న శివుడి మేనమామ అల్పాయుష్కుడైన తన మేనల్లుడికి సుశీలతో వివాహం జరిపించాలనుకుంటాడు.
తల్లికి వాయనం..
ఆమె తల్లి మంగళ గౌరీ వ్రతం కారణంగా శివుడు పూర్ణాయుష్కుడవుతాడని భావిస్తాడు. విషయాన్ని వెంటనే జయపాలుడి దంపతులకు చెప్పి శివుడు, సుశీల వివాహం జరిపిస్తాడు. కొత్త దంపతులు పెళ్లైన రోజు రాత్రి బ్రహ్మచర్య వ్రతం పాటిస్తారు. సుశీలకు మంగళగౌరీ దేవి కలలో కనిపించి నీ భర్త అల్పాయుష్కుడని ఈ రాత్రితో అతని ఆయుష్షు తీరుతుందని చెప్పింది. అప్పుడు సుశీల దోష పరిహారం కోరగా.. కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుందని దాని ముందు నువ్వు పాలకుండను ఉంచమని చెబుతుంది. పాము ఆ ఘటంలోకి ప్రవేశించిగానే కుండ మూతను వస్త్రంతో కట్టి దానిని నీ తల్లికి వాయనమివ్వమని సూచిస్తుంది. మంగళ గౌరీ దేవి చెప్పినట్లుగా సుశీల చేయడంతో శివునికి గండం తొలగిపోయి పూర్ణాయుష్షు పొందుతాడు. ఆ తరువాత శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగినదని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రభావమని చెప్పినది. కాబట్టి ఈ వ్రతం చేసుకుని.. కథను చదివి అక్షింతలు తలపై వేసుకుంటే వ్రత ఫలం దక్కుతుంది.