హిందూ ధర్మం ప్రకారం పూజల సమయంలో శ్లోకాలు, మంత్రాలు చదివేటప్పుడు జపమాలను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ జపమాలలో 108 పూసలు ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.. కానీ 108 మాత్రమే ఎందుకుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? దాదాపు ఆలోచించి ఉండరు. నిజానికి అదేం లెక్క అంటారా? ఈ విషయంలో కొన్ని ఆసక్తికర కథనాలు ఉన్నాయి. మొదటి కథ ఏంటంటే.. ఒక వ్యక్తి రోజుకు అంటే 24 గంటల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడు. ఈ లెక్కన జపమాల చేయడం కష్టం కాబట్టి చివరి రెండు సున్నాలను తీసేసి 108ను నిర్ధారించారనేది ఒక కథనం.
జపమాలలో 108 పూసలు మాత్రమే ఎందుకంటాయనడానికి రెండో కథేంటంటే.. మొత్తం 12 రాశులు.. తొమ్మిది గ్రహాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. మనిషి జాతకం ఈ రెండింటితో ముడిపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. రాశుల సంఖ్యను గ్రహాలతో గుణిస్తే 108 సంఖ్య వస్తుంది. అందుకే జపమాలలో 108 పూసలు ఉన్నాయని అంటారు. ఇక మూడో కథేంటంటే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలు.. ఒక్కో నక్షత్రానికి 7 పాదాలు ఉంటాయి. ఈ లెక్కన ఒక్కో నక్షత్రానికి 7 పాదాల చొప్పున కలుపుతూ పోతే 108 పాదాలవుతాయి. కాబట్టి జపమాలలో 108 పూసలుంటాయని.. అదీ కాకుండా 108 అదృష్ట సంఖ్య అని చెబుతారు.