తెలుగు రాష్ట్రాల్లో గణనాధుని ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని విశేష ప్రాధాన్యం కలిగినవి. వాటిలో ఒకటి అయినవిల్లి విఘ్నేశ్వరుడి ఆలయం. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం అయినవిల్లి వినాయక ఆలయం. ఇక్కడ గణపతి స్వయంగా వెలిశాడని చెబుతారు. ఈ వినాయకుడిని నారికేళ వినాయకుడని అంటారు. ఇలా పిలవడానికి ఓ కారణం ఉంది. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకుని కొబ్బరి కాయ కొడితే చాలు తప్పక మన కోరిక నెరవేరుతుందట. ఈ ఆలయంలో వినాయక చవితి పర్వదినం గణేశ నవరాత్రులను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ దూరంలో, అమలాపురానికి 12 కి.మీ దూరంలో అయినవిల్లి విఘ్నేశ్వరాలయం ఉంటుంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాల నడుమ వినాయకుడు కొలువయ్యాడు. సాధారణంగా దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. కానీ అయినవిల్లిలో వినాయకుడు దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు. అందుకే అయినవిల్లిలో దక్షిణ ముఖ ద్వారంగా ఉండే గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలుగవని.. పైగా సుఖ సంతోషాలతో జీవిస్తారని అక్కడి వారి నమ్మకం. అయినవిల్లిలో గణపతితో పాటు కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. శ్రీదేవి, భూదేవి సమేతుడైన కేశవ స్వామి, శివుడు. శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ కాలభైరవ స్వామి ఉపాయాలు ఇక్కడ ఉన్నాయి.