ఇప్పుడు ధ్యానంపై అవగాహన పెరుగుతోంది. మనసు ప్రశాంతంగా.. నిర్మలంగా ఉండాలంటే ధ్యానం తప్పనిసరి అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అయితే ధ్యానం ఎంత సేపు చేయాలనేది మాత్రం చాలా మందికి అర్థం కాదు. కొన్ని విషయాలకు కొలమానాలంటూ ఏమీ ఉండవు. ఉదాహరణకు భోజనం కడుపు నిండే వరకూ చేస్తాం. అలాగే ధ్యానానికి కూడా కొలమానమంటూ ఏమీ లేదు. ఏ పనులూ లేకుండా ప్రశాంతంగా ఎంతసేపైనా ధ్యానంలో కూర్చోవచ్చు. ఎంతసేపు కూర్చొంటే మనకు అంత ప్రయోజనం వాటిల్లుతుంది. మానసిన శక్తి చేకూరుతుంది. ఎలాంటి సమస్యనైనా తట్టుకుని నిలబడగలుగుతాం.
ధ్యానం చేసేవారు తప్పక కొన్ని నిమిషాల పాటు కూర్చొంటేనే ఫలితం ఉంటుంది. అలా చూస్తే.. కొత్తగా ధ్యానం చేసేవారు తమ వయస్సును సంవత్సరాలలో లెక్కపెట్టి తర్వాత కూర్చున్న ప్రతి సిట్టింగ్‌లోనూ అన్ని నిమిషాలు కళ్ళు తెరవకుండా ధ్యానంలో ఉండటానికి యత్నించాలి. అంటే 25 ఏళ్ల వయసున్న వ్యక్తి కనీసం 25 నిమిషాల పాటు ధ్యానంలో కూర్చోవాలన్న మాట. అంతసేపు కూర్చొంటే.. కనీసం 3 – 5 నిమిషాల పాటైనా ఏ ఆలోచనా లేని స్థితిలో ఉండగలడు. మనం ఎంత సేపు ధ్యానంలో కూర్చొన్నా కూడా కనీసం 5 నిమిషాల పాటైనా మనసును ఆలోచనా రహిత స్థితిలో ఉంచగలగాలి. అప్పుడే నిశ్చలత్వం సాధ్యమవుతుంది. మానసిక పరిస్థితులతో ఇబ్బంది పడేవారు కనీసం రోజుకు రెండు సార్లైనా ధ్యానం చేస్తే క్రమేపి సత్ఫలితాలను పొందుతారట.