ఆ దేవాలయం ఈనాటిది కాదు.. వెయ్యేళ్ల క్రితం నాటిది. ఈ ఆలయ విశేషాలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారి ఆలయం కింద 365 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో పంట నుంచి వచ్చిన ధాన్యంతోనే స్వామివారికి నిత్య నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆలయ ఆస్తులకే ఏటా ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉంటారు. ఈ ఆలయం శ్రీ వేంకటేశ్వర స్వామివారిది. స్వామివారు వెయ్యేళ్ల క్రితం భక్తుడి కోసం తిరుమల నుంచి వచ్చి వెలిశాడని ప్రతీతి. ఇక ఆలయం గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గంలోని వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు 1000 క్రితం స్వయంభుగా వెలిశారు. తిరుమలలో స్వామివారు కుబేరుని వద్ద అప్పు చేశాడని.. ఆ వడ్డీని ఇప్పటికీ తీరుస్తున్నాడని అంటారు. అలాంటి స్వామివారు కందుకూరులో మాత్రం తన కోసం వందలాది ఎకరాల భూములు ఆస్తులు సంపాదించుకున్నారు. వీటికి ప్రతి ఏటా ఆదాయపు పన్ను కడుతున్నారు. కందుకూరులోని బ్యాంకులో మొదటి లాకర్ స్వామివారిదే. ఇక్కడి వెంకన్నకు మీసాలుంటాయి. అందుకే స్వామివారిని మీసాల వేంకటేశ్వరస్వామి అని పిలుస్తారు.