తిరుమల శ్రీవారు ప్రపంచంలో రిచెస్ట్ గాడ్స్‌లో ఒకరు. స్వామివారికి బంగారు ఆభరణాలు ఎన్ని ఉన్నాయో తెలిస్తే నోరెళ్లబెడతారు. శ్రీ మలయప్ప స్వామివారికి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 11 టన్నుల బంగారు భరణాలు ఉన్నాయి. రాజుల కాలంలోనే విశేషంగా స్వామివారికి కానుకలు సమర్పించేవారట. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లలో తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించారు. ఆ సందర్భాల్లో శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారిని ముంచెత్తేవారట. 1513లోనే రెండు సార్లు స్వామివారిని దర్శించుకున్న రాయలు.. కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని.. నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నఖచిత మరో చిన్న కత్తి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకాన్ని స్వామివారికి సమర్పించారట.
ఇక స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో మరింత ముఖ్యమైనదేంటో తెలుసా? 500 గ్రాముల గరుడమేరు పచ్చ. దీనిని మలయప్ప స్వామికి ఉత్సవాల సమయంలో మాత్రమే అలంకరిస్తారు. ఓ ముస్లిం సోదరుడు కూడా స్వామివారికి కానుకలు సమర్పించారు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అందించగా.. అర్చనకు ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌మీరా సమర్పించారు. వేంకటేశ్వర హెచరీస్ సంస్థ 13 కిలోల కిరీటం.. గోయెంకా కుటుంబం 10 కిలోల కిరీటం.. గాలి జనార్ధన రెడ్డి 42 కోట్లు విలువ చేసే వజ్రాల కీరీటం.. పెన్నా సిమెంట్స్ సంస్థ రూ.5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను సమర్పించింది. టీటీడీ సైతం స్వామివారికి కొన్ని ఆభరణాలను సమర్పించింది. ప్రస్తుతం 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా స్వామివారి వద్ద ఇంకా చాలా ఆభరణాలున్నాయి.