కర్ణాటక రాష్ట్రంలో దేవాలయాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయి. వాటిలో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రం ఆది క్షేత్రంగా విరాజిల్లుతోంది. దీనిని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రమని పిలుస్తారు. రెండవది మధ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. దీనిని ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం అని పిలుస్తారు. అంత్య క్షేత్రంగా నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ మూడు కర్ణాటకలో వెలసిన సుబ్రహ్మణ్యుని అద్భుతమైన క్షేత్రాలు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది.
చూడముచ్చటైన ఈ ఆలయాల్లో మొదటిదైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఎక్కడుందంటే.. పశ్చిమ కనుమలలో దక్షిణ కర్ణాటక జిల్లా, కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో ఉంటుందీ ఆలయం. పచ్చని అడవి ఒకవైపు.. ధార నది మరోవైపు. అందమైన ప్రకృతి నడుమ ఉన్న చిన్న గ్రామమే కుక్కే. ఆ గ్రామం మధ్యలో కొలువైన క్షేత్రమే కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం. ఇక్కడ వెలసిన సుబ్రమణ్య స్వామిని చూడగాన గూస్‌బంప్స్ వస్తాయి. స్వామివారి విగ్రహం పడగ విప్పి, కాపు కాస్తున్న ఆరు సర్పాల కాల నాగు వలె ఉంటుంది.