
నృసింహుడు ఎప్పుడూ భక్తులకు అభయ స్వరూపుడుగానే గోచరిస్తాడు. స్వామి వారి గోళ్ళు ఎలా ఉన్నాయి అంటే శరణాగతులైన భక్తుల కళ్ళకి అవి నెలవంకల్లాను, రాక్షసులకు గుండెలు చీల్చే కొడవళ్ళులా కనబడుతున్నాయి. వారి వారి సంస్కారములను అనుసరించి సత్పురుషులకు రక్షాస్వరూపంగాను, దుష్టులకు శిక్షాస్వరూపంగాను గోచరిస్తున్నాయి నఖములు. అటువంటి గోళ్ళతో ఒప్పుతున్న నృసింహ స్వామి నామాన్ని ఒక్కసారి స్మరించినా చాలు. విషబాధలు పోతాయి.
అనేకరకాల రోగాలను, అపమృత్యువులను, అకాల మృత్యువులను తొలగించే శక్తి నృసింహోపాసనలో ఉన్నది. కనుక నృసింహోపాసన మృత్యుంజనోపాసనయే. నృసింహుడు ప్రధానంగా అగ్నితత్త్వ స్వరూపుడు. నృసింహతత్త్వంతో పాటు సుదర్శన తత్త్వాన్ని కలిపి ఉపాసించడం సంప్రదాయం. ఈ రెండూ కూడా రక్షాస్వరూపములే. ఈ సమయంలో ఉభయులూ మనలను, ప్రపంచాన్ని రక్షించాలని ప్రార్థన చేయాలి. నృసింహ నామాలు కూడా చాలా విశేషంగా శాస్త్రాలు చెప్తున్నాయి. అవి జ్వరహర నృసింహుడు. ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడి గండం నుంచి బయటపడతామా అని వేదన కలుగుతున్న సమయంలో ఒక్కసారి నారసింహుని గానీ తలంచినట్లయితే ఆయన చేయూతనిస్తాడు.
