కొన్ని ఆలయాలకు వెళితే అక్కడి నుంచి తిరిగి రావాలనిపించదు. ప్రకృతి నడుమ కొలువుదీరిన దేవతామూర్తులను చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నేచర్ లవర్స్ అయితే ముఖ్యంగా ఈ ఆలయానికి వెళితే తిరిగి రావాలని అనుకోరు. అసలు ఎక్కడుందా ఆలయం? దానిలో ఎవరు కొలువుంటారో తెలుసుకుందాం. చుట్టూ ఎత్తైన గుట్టలు.. పచ్చని చెట్లపై వాటిపై నిత్యం వినిపించే పక్షుల కిలకిలారావాలు.. రంగుల పూల మొక్కలు.. అందరినీ పలకరిస్తూ తిరిగే మర్కటాలు.. బండ రాళ్ల మధ్య నుంచి ఉబికి వచ్చే జలధార.. ఒకటేమిటి అక్కడి అందం మనల్ని కట్టిపడేస్తుంది.
అలాంటి ప్రదేశంలో వెలిశాడు బుగ్గ రామలింగేశ్వరస్వామి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని అక్కపల్లి గ్రామంలో ఉందీ ఆలయం. ఈ ఆలయానికి నాలుగు శతాబ్ధాల ఘనమైన చరిత్ర ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో బండరాళ్ల నడుమ నిత్యం జలధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏటా మాఘ అమవాస్య రోజున పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. నిరంతరం ఈ జల ధార ప్రవహిస్తూ ఉండటం కారణంగానే ఈ నీట బుగ్గ పేరు మీదుగా ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలోని స్వామివారిని లింగమూర్తిగా భక్తులు పిలుచుకుంటారు. ఇక్కడ మునులు నడయాడటం వల్లనే నీటి ప్రవాహమని చెబుతారు.