
లక్ష్మీదేవిని సంపదలకు అధిదేవతగా భావించి పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే సిరిసంపదలకు లోటుండదని చెబుతారు. ఇంట ఆర్థిక సమస్యలనేవే ఉండవట. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అయితే వ్యూహ లక్ష్మి అమ్మవారి గురించి తెలుసా? ఈ అమ్మవారిని దర్శించుకుంటే చాలట.. సిరిసంపదలకు లోటుండదట. అసలు ఎవరీ వ్యూహలక్ష్మి? ఎక్కడ ఉంటుంది? ఈ అమ్మవారిని ఎలా దర్శించుకోవాలి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ వ్యూహ లక్ష్మి అమ్మవారు తిరుమల శ్రీవారి గర్భాలయంలోనే ఉంటుంది.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూలవిరాట్టు వక్షస్థలంలో మహాలక్ష్మి ప్రతిమ ప్రతిష్టించి ఉంటుంది. వైకుంఠనాధుడి వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మి కొలువుదీరి ఉంటుంది కాబట్టే స్వామివారిని ‘శ్రీ’నివాసుడని పిలుస్తారు. శ్రీ మలయప్ప స్వామి వక్షస్థలంపై ఉన్న శ్రీమహాలక్ష్మికి వ్యూహలక్ష్మి అని తంత్ర శాస్త్రంలో పేరు. ఇది ప్రపంచంలోని ఏ దేవాలయంలో కనిపించని తంత్ర శాస్త్ర పరమైన విశేషం. ఒకానొక సమయంలో తిరుమలలో వెలసిన శ్రీవారు ఎవరనే ధర్మసందేహం భగవత్ రామానుజుల వారికి కలిగిందట. ఆ సందర్భంలో భగవత్ రామానుజుల స్వామి వారు సాక్షాత్తు వైకుంఠనాధుడని, వైకుంఠం నుంచి భూలోకంలో అర్చావతార మూర్తిగా అవతరించారని చెబుతారు.
