
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గా దేవి రోజుకో అవతారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారి మండపాలను ఎంతో అందంగా అలంకరిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఆర్యవైశ్య సంఘంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక్కడి అమ్మవారికి రూ.45 లక్షల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. శ్రీ మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని ఇలా కరెన్సీ నోట్లతో అలంకరించారు.
అక్కడి మండప నిర్వాహకులు 100, 200, 500 విలువైన కరెన్సీ నోట్లను దండలుగా అల్లి అమ్మవారి మెడలో పూలమాలగా అలంకరించారు. చివరకు అమ్మవారికి నైవేద్యంగా కూడా కరెన్సీ నోట్ల కట్టలను సమర్పించారు. అమ్మవారి పళ్లెంలో నైవేద్యంగా కరెన్సీ నోట్ల కట్టలను ఏర్పాటు చేశారు. దుర్గాదేవి అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో అమ్మవారిని అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ ఆర్యవైశ్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు.
