
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్.గోపాల్జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు.
నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు. చెన్నైకి చెందిన తిరుపతి అంబ్రాలా చారిటిస్ ట్రస్టీ శ్రీ వరదరాజులు 11 గొడుగులను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావుకు శ్రీవారి ఆలయం వద్ద అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
