దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రోజురోజుకూ వీఐపీ భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భక్తుల సౌకర్యార్థం ఇవాళ్టి ( సోమవారం) నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు ఆదివారం తెలిపారు. శ్రావణమాసం ఇవాళ ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి రోజూ ఉదయం 10:15 గంటల నుంచి 11:15 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
బ్రేక్ దర్శన్ టికెట్ ధరను రూ.300 గా నిర్ణయించడం జరిగింది. ప్రతి రోజూ 300 నుంచి 500 మంది వరకూ బ్రేక్ దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు బ్రేక్ దర్శనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యంగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవో కార్యాలయం ముందున్న ప్రస్తుత శీఘ్ర దర్శనం క్యూలైన్‌ను బ్రేక్ దర్శనానికి ఉపయోగించాలని నిర్ణయించారు. బ్రేక్ దర్శనం చేసుకునే ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ఉచితంగా అందజేయనున్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పకడ్బందీగా పనులు పూర్తి చేసినట్లు ఆలయ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.