17 నుంచి రొట్టెల పండుగ.. దీని ప్రాముఖ్యతేంటంటే..

నెల్లూరులో ఈ నెల 17 నుంచి రొట్టెల పండుగ జరుగనుంది. ఈ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాత బారాషహీద్ దర్గాలో ఈ రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది. దీనికి కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతూ ఉంటారు. మనసులో ఏదైనా కోరిక కోరుకుని రొట్టెలను పంచితే కోరిక తప్పక నెరవేరుతుందని నమ్మకం. కోరిక నెరవేరిన తరువాత కూడా రొట్టెలను పంచుతారు. ముఖ్యంగా ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు.

ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది బారాషహీద్ దర్గాకు వచ్చి కృతజ్ఞతగా స్వర్ణల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచే నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో ప్రతి ఏటా రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలైందట. అప్పటి నుంచి క్రమం తప్పకుండా జరుగుతోంది. భక్తులు ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు (రొట్టెలు) చెరువులోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు. ఆరోగ్యం గురించి మొక్కుకున్న వారు ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టె కావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లించుకుంటా. ఇలాగే విద్యా రొట్టె, పెళ్ళి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె అంటూ ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు.

Share this post with your friends