బోనమెత్తిన హైదరాబాద్.. తొలి బోనం శ్రీ జగదాంబిక మహంకాళికే..

హైదరాబాద్ బోనమెత్తింది. నగరమంతా సందడిగా మారింది. బోనాల పండుగకు గోల్కొండ కోట అత్యంత సుందరంగా ముస్తాబైంది. తొలి బోనం శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికే ఎత్తడం జరిగింది. లక్ష మంది భక్తులు బోనాల వేడుకకు వస్తారని అంచనా వేయడంతో ముందుగానే అందుకు సంబంధించి ఏర్పాట్లను నిర్వహించడం జరిగింది. రెండు పచ్చి కుండలతో కులవృత్తుల నాయకుడు శంకర్ ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటలకే తొలి బోనం సమర్పించారు. ఇక ఆ తరువాతి నుంచి బోనాల సమర్పణ ప్రారంభమైంది.

ఇవాళ మధ్యాహ్నం గోల్కొండలోని ఫతేదర్వాజాలో ఉన్న పూజారి సర్వేశ్‌కుమార్ ఇంటి నుంచి జగదాంబికా అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఇక మహంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు వచ్చేసి గోల్కొండ ఆలయ అమ్మవారి కులవృత్తుల సంఘం నాయకుడు బొమ్మల సాయిబాబాచారి నివాసం నుంచి ప్రారంభమైంది. ఐరావతంపై వందమంది పోతురాజులతో అమ్మవార్లను ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అన్నదానానికి సైతం ఏర్పాట్లు చేశారు. అధికారులు బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వైద్యం నుంచి తాగునీరు వరకూ సకల ఏర్పాట్లు చేశారు.

Share this post with your friends