బిగ్ అలర్ట్.. శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్లు ఆన్‌లైన్ కోటా ఇవాళే విడుదల

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అంగ ప్రదక్షిణ కోసం ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఒక కౌంటర్ పెట్టి.. ఆ కౌంటర్‌లో టికెట్లను విక్రయిస్తూ ఉండేవారు. మధ్యాహ్న సమయంలో ఇచ్చే ఈ టికెట్ల కోసం భక్తులు తెల్లవారు జామునే వెళ్లి క్యూలైన్‌లో నిలుచునే వారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అన్ని ఆన్‌లైన్ చేసేశారు. దీంతో భక్తులకు కాస్త ఇబ్బంది తగ్గింది. అయితే కాస్త చదువు రాని వారికి మాత్రం ఆన్‌లైన్‌లో టికెట్లు పొందడం కష్టతరమే. ఇక టీటీడీ శనివారం ఆగస్ట్ 10 వ తారీఖునకు సంబంధించిన మొత్తం 250 అంగ ప్రదక్షిణ టోకెన్‌లను ఆగస్ట్ 09 మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణం టోకెన్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది. ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్య వర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఇటీవలి కాలంలో చాలా మంది మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోతున్నారు. ఇది ఎక్కువగా శ్రీవాణి టికెట్ల విషయంలో జరుగుతున్నట్టుగా తాజాగా టీటీడీ గుర్తించింది. 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. అటువంటి వాటన్నింటినీ బ్లాక్ చేసి వారికి మెసేజ్ ఫార్వార్డ్ చేసింది. అవకతవకలకు పాల్పడే వారిపై టీటీడీ క్రిమినల్ చర్యలు తీసుకుంటోంది కాబ్టటి భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేస్తోంది.

Share this post with your friends