శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో నవంబర్ కోటా టికెట్ల విడుదల

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ నవంబర్ కోటాకు సంబంధించిన వివిధ రకాల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ రోజు ఆన్‌లైన్‌లో నవంబర్‌ నెల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. కాబట్టి భక్తులందరూ ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు.. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో నవంబరు నెల గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఈ నెల 27వ తేదీన పలు సేవలకు సంబంధించిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి సేవ కోటా కోసం 27న ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 69,098 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 34,707 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు వచ్చింది.

Share this post with your friends