
తిరుమలలో మోసాలకు కొదువేం లేదు. ముఠాలుగా ఏర్పడి మరీ మోసాలకు పాల్పడుతుంటారు. అలాంటి ముఠా ఒకటి తాజాగా విజిలెన్స్ వింగ్ అధికారులకు చిక్కింది. రూ.300 స్పెషల్ దర్శనం చేయిస్తామంటూ భక్తులను నమ్మబలికి పెద్ద మొత్తంగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఆపై రూ.300 కలర్ జిరాక్స్ టికెట్లను వారి చేతిలో పెడుతున్నారు. ఇలాంటి మోసానికి పాల్పడుతున్నది మరెవరో కాదు.. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఎస్ఈడీ స్కానింగ్ కౌంటర్ లో పని చేస్తున్న రుద్రసాగర్, దళారి నవీన్ తేజ్ అలియాస్ తేజ్, ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ డ్రైవర్ పెరియస్వామి. మొత్తానికి విజిలెన్స్ అధికారులకు వీరు అడ్డంగా దొరికిపోయారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.
మోహన్ రాజ్ అనే వ్యక్తి కుటుంబం చెన్నై నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చాడు. అతడిని సంప్రదించిన సదరు మఠా సభ్యులు రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఇస్తామని కేవలం రెండు, మూడు గంటల్లో దర్శనం చేసుకుని రావొచ్చని నమ్మబలికారు. సరేనని మోహన్ రాజ్ వారు అడిగినంత డబ్బిచ్చి నాలుగు టికెట్లు కొనుగోలు చేశాడు. మోహన్ రాజ్ అతని కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వెళ్లగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న టికెట్లను పరిశీలించారు. పాత టికెట్లను తీసుకుని వాటి సీరియల్ నంబర్లు మార్చి కలర్ జీరాక్స్ తీసినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. అసలు విషయం ఆరా తీయగా ముఠా బండారం బయట పడింది. కాబట్టి ఇలాంటి ముఠాల విషయంలో తిరుమలకు వచ్చే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది.
