భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో నేటి నుంచి బ్రేక్ దర్శనం…

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో నేటి నుంచి బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 9.30 వరకూ.. రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు బ్రేక్ దర్శనం భక్తులు చేసుకోనున్నారు. బ్రేక్ దర్శనం సమయంలో ఎటువంటి పూజలూ ఉండవు. కేవలం ఆ దర్శనానికి వచ్చే భక్తులను మాత్రమే అనుమతిస్తారు. బ్రేక్ దర్శన టికెట్ ధర 200 రూపాయలుగా దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకూ మనకు తెలిసి తిరుమల సహా కొన్ని దేవాలయాల్లో మాత్రమే బ్రేక్ దర్శన అవకాశం ఉంది. ఇక మీదట భద్రాద్రిలోనూ ఆ అవకాశం లభించనుంది.

శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయం విష్ణు మూర్తి అవతారమైన రాముడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం . ఇది భారతదేశంలోని తూర్పు తెలంగాణలోని భద్రాచలం పట్టణంలో గోదావరి నది ఒడ్డున ఉంది. దీనిని దక్షిణ అయోధ్యగా పిలుచుకుంటూ ఉంటారు. దీనిని భద్రగిరి, భద్రాద్రి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం గోదావరి దివ్య క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. 17వ శతాబ్ధంలో భక్త రామదాసు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయ నిర్మాణానికి నిధులను సుల్తానేట్ ఖజానా నుంచి ఉపయోగించినట్టు ఆరోపణలు రావడంతో జైలులో బంధించారు. అప్పట్లో రామలక్ష్మణులు స్వయంగా వెళ్లి ఆ డబ్బును చెల్లించి రామదాసును విడిపించారని ప్రతీతి.

Share this post with your friends