దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఒక్కోచోట ఒక్కోలా జరుగుతుంటాయని చెప్పుకున్నాం కదా. ఒక గ్రామంలో శక్తి పటాల ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. అది మరెక్కడో కాదు. కృష్ణా జిల్లాలోని రేవు పట్టమైన బందర్‌లో దసరా సందర్భంలో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తూ ఉంటారు. దాదాపు వంద సంవత్సరాల క్రితం కలకత్తా నుంచి బొందిలీలకు చెందిన సైనికుడు మచిలీపట్నం ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ట చేసాడు. అప్పటి నుంచిదసరా సమయంలో శక్తి ఆలయం నుంచి శక్తి పటాన్ని పట్టుకుని పురవీధులలో ఊరేగింపుగా తీకుసుకు రావడం ప్రారంభం అయింది.
ఊరేగింపు సమయంలో అమ్మవారి పటాన్ని వీపునకు కట్టుకుని ముఖానికి అమ్మవారి భయంకర ముఖాకృతిని తగిలించుకుని నాట్యమాడుతూ వీధులలో తిరుగుతారు. తొమ్మిది రోజులు ప్రభలలో ఇలా అన్ని వీధులలోని ఇంటింటికీ తిరుగుతారు. వారి వారి ఇంటికి వచ్చినపుడు వారి మొక్కుబడులు తీర్చుకుంటారు. పటం ధరించిన వారు డప్పు శబ్ధానికి అనుగుణంగా వీర నృత్యం చేస్తూ భయంకరాకృతిలో ఉన్న రాక్షసుని సంహరిస్తున్నట్లు అభినయిస్తారు. చివరిరోజున మచిలీపట్నం కోనేరు సెంటరుకు తీసుకు వచ్చి జమ్మి కొట్టడంతో ఉత్సవం ముగుస్తుంది.