అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వర స్వామివారి కథేంటంటే..

శ్రీ వేంకటేశ్వర స్వామివారు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తన్నారట. ఈ క్రమంలోనే అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడట. తర్వాత ఇక్కడి నుంచి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురంలో ఆరునెలలు ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం.ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్ధం ఒక గుంట తవ్వించాడని అప్పటి నుంచి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా పిలువబడినదని కాలక్రమంలో అది అప్పలగుంటగా మారిందని తలుస్తుంది.

అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పనిచేసిన వారికి కూలి అప్పు పెట్టకుండా ఏరోజుకు ఆరోజే ఇచ్చేవాడని అందుకనే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అదనంగా ప్రచారంలో ఉంది. ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు ఉండటంతో వాతావరణము చాల ప్రశాంతంగానూ.. ఆహ్లాదకరంగానూ ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాలయం ఎదురుగా గర్భ గుడిలో శ్రీ వారి దివ్య మంగళ రూపం భక్తులను కనుల విందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంటుంది.

Share this post with your friends