తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకూ వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జులై 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. జూలై 17న ఉదయం 6.28 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం హంసవాహన సేవ నిర్వహిస్తారు. జులై 18, 19, 20, 21వ తేదీల్లో ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా జూలై 18న సాయంత్రం చంద్రప్రభ వాహనం, 19న సాయంత్రం చిన్నశేష వాహనం, 20న సాయంత్రం సింహ వాహనం, 21న సాయంత్రం నంది వాహనసేవ జరుగుతాయి.
జూలై 22న సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. ఈ కల్యాణోత్సవంలో దంపతులు పాల్గొనవచ్చు. కల్యాణోత్సవంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.300/- చెల్లించాల్సి ఉంటుంది. అదే రోజున రాత్రి 7.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు. జూలై 23న సాయంత్రం పల్లకీ సేవ, 24న సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం, 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు వాహన సేవలు నిర్వహిస్తారు. జూలై 26వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.