అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్ఫణ జరగనుంది. ఇప్పటికే స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను జేఈవో శ్రీ వీరబ్రహ్మం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ప్రారంభించనున్నారు. తిరిగి జూన్ 25న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 11వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ.. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 20వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు దంపతులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.500 చెల్లించి పాల్గొనవచ్చు.