దైనిలోనైనా సరే.. ఓడిపోతున్నాం అనుకున్నవారంతా ఆ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. దీనిని దర్శించుకుంటే తప్పక విజయం సాధిస్తారట. ఈ ఆలయం ఎవరిది? ఎక్కడుంది అంటారా? ఖతు శ్యామ్ జీ ఆలయం. ఇది రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం 1000 ఏళ్ల క్రితం నిర్మించినదట. దీనిని 1720లో అభయ్ సింగ్ పునర్నిర్మించారు. ఈ ఆలయంలో కొలువైనది ఖతు శ్యామ్ జీ అంటే భీముని మనవడు. ఘటోత్కచుని ముగ్గురి కుమారులలో పెద్దవాడు. ఇతని అసలు పేరు బర్బరికుడు. ఇతను ధైర్యానికి ఐకాన్. కురుక్షేత్ర యుద్ధంలో బర్బరీకుడు ప్రాణ త్యాగానికి వరంగా తన పేరు మీదుగా పూజలందుకునే వరాన్ని శ్రీకృష్ణుడు ఇచ్చాడట.
కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోయే వారికే తన మద్దతు అని బర్బరీకుడు ప్రకటించాడట. వెంటనే తల్లికి విషయం చెప్పి ఆమె ఆశీర్వాదం తీసుకుని కురుక్షేత్ర యుద్ధంలో ఓటమి దిశగా పయనిస్తున్న కౌరవుల పక్షాన పోరాడేందుకు సిద్ధమయ్యాడట. ఒకవేళ బర్బరికుడు కౌరవుల పక్షాన నిలిస్తే పాండవులకు ఓటమి తప్పదని గ్రహించిన కృష్ణుడు.. బ్రహ్మణ వేషంలో అతని వద్దకు వెళ్లాడట. దానంగా బర్బరికుడి తలను అడిగాడట. ఏమాత్రం సంకోచించక బర్బరికుడు తన తలను నరికి కృష్ణుడికి దానమిచ్చాడు. అప్పుడు అతని ప్రాణత్యాగానికి మెచ్చిన కృష్ణుడు తన పేరిట పూజలందుకునే వరం ఇచ్చాడట. అందుకే ఈ ఖతు శ్యామ్ జీ ఆలయానికి వెళితే ఓటమి అనేదే ఉండదట.