తిరుమలలో వైభవంగా కాళీయ‌మ‌ర్ధనుడికి అభిషేకం

టీటీడీ ఉద్యాన‌వ‌న విభాగం ఆధ్వర్యంలో గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమల గోగర్భం సమీపంలోని కాళీయ‌మ‌ర్ధనుడైన శ్రీ‌కృష్ణునికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు తోచందనాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ, ఉట్లోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, గార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవేంకటేశ్వర స్వామిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా భావించి ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ద్వాదశారాధనం చేపట్టారు. శ్రీకృష్ణ స్వామివారిని బంగారు సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి ప్రబంధగోష్ఠి, పురాణ పఠనం చేపట్టారు. కాగా ఇవాళ తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.

Share this post with your friends