చింతపల్లివారి ఆడపడుచైన మరిడమ్మకు వారానికో సంబరం..

పెద్దాపురం పట్టణంలో ఉన్న దాదాపు అన్ని వార్డుల్లోని ప్రజలు మరిడమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే మొట్టమొదటి జాతర మాత్రం పాత పెద్దాపురం కోటముందు గ్రామస్థులు మాత్రమే నిర్వహిస్తారు. వీరు నిర్వహించేది జాగారం మిగిలిన వీధుల వారు నిర్వహించేది సంబరం గానూ వ్యవహరిస్తారు. బహులైక జేష్ఠ అమావాస్య సాయంత్రం మొట్టమొదట జాతర గరగలు గుడి వద్ద జాతర గరగల కంటే ముందు ఎత్తి అమ్మవారి సమక్షంలో గరగ నృత్యం ఒక ఆట పులి నృత్యం (పులి ఆటకి రాష్ట్రములోనే ప్రసిద్ధి చెందిన పులి ఆటకారులున్నారిక్కడ ) ఒక ఆట ఆడి పాత పెద్దాపురం కోటముందుకి పయనమవుతారు. మరిడమ్మ ఆస్థానం నుంచి తీసుకువెళ్లిన గరగలను పాతపెద్దాపురం మరిడమ్మ ఆలయానికి అనువంశిక ఆలయ ధర్మకర్తలు పానుపు వేస్తారు.

అనంతరం పసుపు కుంకుమలు పూసి, కాగడాలు వెలిగించి ధూపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారికి ఇష్టమైన పాటపాడి హారతి ఇవ్వడంతో పాన్పు పూర్తవుతుంది. తరువాత జాతర కార్యక్రమం అంగరంగ వైభవంగా, గరగలు, పులి, కొయ్యడాన్సులు, తప్పెటగుళ్లు, కర్రసాము, కోలాటం ఇంకా అనేక ఇతర కార్యకమాలతో, దేవతా వేషధారణ లతో వున్న ట్రాక్టర్ల ఊరేగింపుతో బాణాసంచా పేలుళ్లతో రెండు ఆలయాల వద్ద భారీగా జరుగుతుంది. గ్రామ దేవతగా ఆరాధించే పెద్దాపురంలో ఆయా వీధుల వారు అమ్మవారి సంబరాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రూ.లక్షలు వెచ్చించి అమ్మవారి సంబరం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది వీధి సంబరాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఆయా ఉత్సవ కమిటీలు సిద్ధమవుతున్నాయి. ఇది పట్టణంలో ప్రత్యేకతను చాటనుంది.

Share this post with your friends