
మన దేశంలో పాముల నుంచి మొదలు తేళ్ల వరకూ ప్రతి ఒక్క దానికి ఆలయాలున్నాయి. మనం చెట్లను, జంతువులను అన్నింటినీ పూజిస్తూ ఉంటాం. కుక్కను సైతం భైరవుడిగా పూజిస్తూ ఉంటాం. అయితే ఓ చోట మాత్రం ప్రత్యేకంగా కుక్కలకు ఆలయం ఉంది. కర్ణాటకలోని చన్నపట్నలో అగ్రహార వలగెరెహళ్లి అనే చిన్న గ్రామంలో ఉందీ ఆలయం. ఈ నగరం చెక్క బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకే దీనిని ‘బొమ్మల పట్టణం’ అని కూడా పిలుస్తారు. బెంగళూరు నగరానికి దాదాపు 60 కి.మీ దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. 2010లో ఈ ఆలయాన్ని రమేష్ అనే వ్యాపారి నిర్మించారు. అసలు ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారనే విషయమై ఆసక్తికర కథ ఉంది.
గ్రామస్తుల కథనం ప్రకారం.. ఒకసారి గ్రామంలో ఉన్న రెండు కుక్కలు హటాత్తుగా అదృశ్యమయ్యాయి. గ్రామంలోని దేవత ఓ గ్రామస్తుడి కలలో కనిపించి తప్పి పోయిన కుక్కలకు ఆలయాన్ని నిర్మించమని కోరిందట. దీంతో తప్పిపోయిన కుక్కల కోసం ఆలయాన్ని నిర్మించారు. వీటిని అప్పటి నుంచి దేవుడిగా భావించి పూజిస్తూ ఉంటారు. ఈ కుక్కలు తమని ఎప్పుడూ కాపాడతాయని గ్రామస్తులు నమ్ముతారు. కుక్కల కోసం ఆలయాన్ని నిర్మించడమే కాకుండా వీటి గౌరవార్థం ప్రతి సంవత్సరం గ్రామంలో భారీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తుంటారు.
