రెండు రోజుల పాటు అరసవెల్లిలో అద్భుతం ఆవిష్కృతం..

ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి ఆలయం అరసవిల్లిలో ఉన్న విషయం తెలిసిందే. మన దేశంలో సూర్యనారాయణమూర్తి క్షేత్రాలు చాలా తక్కువ. వాటిలో అరసవెల్లి ఆలయం ఒకటి. శ్రీకాకుళం పట్ణణానికి 2 కి.మీ దూరంలోని అరసవల్లి గ్రామం ఉంటుంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణ మూర్తి తన భక్తులకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవంగా వెలుగొందుతున్నాడు. ఇక్కడ తాజాగా ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సూర్య భగవానుడి మూల విరాట్టును సూర్యుని లేలేత కిరణాలు తాకాయి. దీంతో స్వామివారి మూల విరాట్ దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు దర్శనమిచ్చాడు.

నిన్న ఉదయం ఈ అద్భుత ఘట్టం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కనువిందు చేసింది. నిన్నే కాదు.. ఇవాళ కూడా సూర్య కిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకడంతో ఆ దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించి పోయారు. ప్రతి ఏటా ఉత్తరాయణం, దక్షిణాయనంలో సూర్య కిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకుతాయి. దక్షిణాయంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో.. ఉత్తరాయణంలో మార్చి 9,10 తేదీల్లో సూర్యకిరణాలు ఆలయంలోని మూల విరాట్‌ను నేరుగా తాకుతాయి. అయితే గత రెండేళ్లుగా వాతావరణం పారదర్శకంగా లేని కారణంగా సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్టును స్పృశించకలేక పోయాయి. రెండేళ్ల తరువాత భక్తులు తిరిగి ఈ దృశ్యాన్ని చూసి ఆనందించారు.

Share this post with your friends