
ద్వారక అనేది శ్రీకృష్ణుని దివ్య నగరం. ఇది ఎందుకు నిర్మించబడింది? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మథురలో కంసుని సంహారం అనంతరం, కంసుని అల్లుడు జరాసంధుడు పదేపదే మథురపై దాడులు చేయసాగాడు. మథుర ప్రజలు యుద్ధ భయంతో, అశాంతితో జీవించాల్సి వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచించాడు: “ధర్మం రక్షించాలంటే ప్రజలను ముందుగా కాపాడాలి.” యుద్ధం వల్ల నిరపరాధ ప్రజలు బాధపడకూడదని, యాదవ కులాన్ని సురక్షితంగా ఉంచాలని శ్రీకృష్ణుడు సముద్ర తీరంలో ఒక అజేయ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాడు.
ఇదే ద్వారక నిర్మాణానికి మూలకారణం. అనుకున్నదే తడవుగా శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వకర్మను పిలిచి “సముద్ర మధ్యలో, ఎవరికీ అందని స్థలంలో, ధర్మానికి ప్రతీకగా ఒక మహానగరాన్ని నిర్మించు.” అని ఆజ్ఞాపించాడు. సముద్రుడు కూడా కృష్ణుని ఆజ్ఞకు లోబడి 12 యోజనల భూమిని వెనక్కు తీసుకుని నగర నిర్మాణానికి చోటు ఇచ్చాడు.
పురాణాల ప్రకారం: ద్వారక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మథుర విడిచిన తరువాత, ఒకే రోజులో, దివ్యశక్తితో నిర్మించబడింది. ద్వారక నగర వైభవం – సువర్ణమయ నగరమా? అంటే అవుననే చెప్పాలి. ద్వారక నిజంగా సువర్ణమయ నగరమే.
