
మాఘమాసంలో ఎన్నో శుభదినాలున్నాయి. వాటిలో మధ్వనవమి కూడా ఒకటి. ఇవాళ అంటే జనవరి 27 మంగళవారం మధ్వానవమి. మాఘ శుక్ల నవమి మధ్వనవమిగా ప్రసిద్ధం. అసలు మధ్వనవమిని ఎందుకు జరుపుకుంటారు? దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. భారతీయ దర్శనాల్లో ముఖ్యమైన మూడు సిద్ధాంతాలలో ఒకటి ద్వైత సిద్ధాంతం. ద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ధర్మమూర్తి, పూర్ణప్రజ్ఞులు శ్రీ మధ్వాచార్యులు. ఆయన ఉడుపిలోని అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుకు భాష్యం చెప్పారని చెబుతారు.
అయితే ఆ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారట. ఆ పుష్పవృష్టిలో అంతర్థానమై బదరికాశ్రమాన్ని చేరిన రోజు మధ్వ నవమిగా చెబుతారు. త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం.. శ్రీమధ్వాచార్యులు. ఆయన ఆశ్వయుజ విజయదశమి నాడు 1238లో దక్షిణ కన్నడ ఉడిపివద్ద పాజక గ్రామంలో జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట, వేదవతిలుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్వ ప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.
