
ఏదో ఒక పెద్ద పని కోసం బయటకు పోయి నప్పుడల్లా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటారు. ఎందుకంటే మనకు వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయవంతమవుతుందనే నమ్మకం. పెద్దల ఆశీర్వాదం ఎంత ప్రయోజనకరం.. ఫలవంత మైనదో తెలియజేసే కథను తెలుసుకుందాం.
పూర్వం సదాచార వేద పండితుడు ఒకడుండే వాడు. సరస్వతి కటాక్షమే కానీ లక్ష్మీ కటాక్షం లేనివాడు. అతనికి ఒక్కడే కుమారుడు. పండితుడికి వాక్సుద్ధి కలవాడిగా పేరొందినవాడు. అవసాన దశలో కొడుకుని పిలిచి, ‘‘నాయనా! నేను నీకంటూ ఏ అస్తిపాస్తులు కూడపెట్టలేదు. కానీ నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించింది ఒక్కటే. జీవితాంతం నా పని విషయంలో ఎప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నాను. నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయ వంతంగా ఉంటావు. నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది’’ అని చెప్పి ప్రాణాలు వదిలాడు.
తండ్రికి చేయవలసిన ఖర్మలన్నీచేశాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు. విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఊరికే కూర్చోక చేతితో దోసిలి నిండా ఇసుకను తీసుకొని కిందకు పోస్తున్నాడు. ఒకసారి పోసాడు. రెండో సారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదము గుర్తుకొచ్చింది. “పట్టిందల్లా బంగారం అవుతుంది” ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుంది అని ఇసుకను కిందికి పోసి చూసాడు. మూడో సారి ఇసుకను చేతిలోనికి తీసుకొని తలపకెత్తగానే చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురి పెట్టి నిల్చొని వున్నారు. పక్కన రాజు గారు వున్నారు. ఆయన తీవ్రంగా ఏం చేస్తున్నావు? ఏం వెతుకు తున్నావని అడిగారు. దానికి తండ్రి మరణం, తన దుస్థితిని వివరించాడు. అప్పుడు సైనికులు దూరంగా వెళ్లిపోయారు.
అప్పుడు రాజుగారు.. ‘‘మా నాన్న గారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు ఒక బహుమతిగా ఒక ఉంగరం ఇచ్చారు. అది రెండు రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో పడి పోయింది. రెండు రోజులుగా వెతుకుతున్నాం. నీవు అ విషయం తెలుసుకొని వెతుకుతున్నావని మా సైనికులు అనుకొన్నారు’’ అని చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి తన చేతిలోని ఇసుక చటాలని కిందికి వదిలి లేచాడు. తండ్రి వాక్భలం. ఆ ఇసుక లొనే రాజుగారి ఉంగరం దొరినది. రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.వెంటనే మూడు సoచుల బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు. దానితో బంగారు నగల వ్యాపారం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి ఆ రాజ్యoలోని గొప్ప వ్యాపారస్తుల జాబితాలోకి చేరిపోయాడు. తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని ఈ కథ మనకు తెలియజేస్తోంది.
