
మాలే మణివణ్ణా మార్-గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్
ఈ రోజు మనవాళ్ళంతా శ్రీ కృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు. తిరుప్పావైలో ఆండాళ్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది. అందులో మొదటగా “శెయ్యాదన శెయ్యోం” మన పూర్వులు చేయనివి చెయ్య కూడదు. ఈ మధ్యకాలంలో మనం సౌకర్యాలకని తెచ్చి పెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్నవారికి తెలుసు. ఇదివరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బతికేవారు మన పూర్వులు. సౌకర్యం కోసం భౌతికమైనవి చెయ్యవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు, ఇది గుర్తుంచుకోవాలి.
ఆత్మోజ్జీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేం ఆచరించం అని చెప్పింది. ఆపై “మేలైయార్ శేయ్-వనగళ్” ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి. మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా “నానే తాన్ ఆయిడుగ” నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యంవైపు చెదరని స్థితిని ఆర్జించడం. ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఆండాళ్ తల్లి. ఈ రోజు ఆండాళ్ తల్లి “మేలైయార్ శేయ్-వనగళ్” సూత్రాన్ని చెబుతుంది. పెద్దలు అన్నప్పుడు, కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాక పోవచ్చు. వేదంలో ఇవి తగును, ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది. వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు. ఇది ఒక నిరూపణ.
స్వామిలోని ప్రేమను కనిపెట్టి “మాలే మణివణ్ణా” ఓ మణి మాణిక్యమా అంటూ పిలుస్తున్నారు. అయితే తన ప్రేమను కనిపెట్టేసారు, ఇక ఎక్కడ లోంగాల్సొస్తుందేమోనని స్వామి నాకు ఈ పేరు ఏం కొత్త కాదు, మా అమ్మ యశోదమ్మ కూడా ఇలాగే పిలిచేది. అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి. “మార్-గరి నీరాడువాన్” మార్గశీర్ష స్నానం చేయాటానికి మేం వచ్చామయా అని చెప్పారు.
అయితే ఎవరు చెబితే చేస్తున్నారు అని అడిగాడు స్వామి. “మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన” మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేం చేస్తున్నాం. దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు. అందులోనూ గోపికలు ఆచరించినది కదా, ఇక ప్రశ్నే లేదు. స్వామికి చాలా సంతోషం వేసింది తన ఆర్తితో వీళ్ళనంతా అట్టే చూస్తూ ఉండిపోయాడు. “కేట్టియేల్” వినబడుతుందా మేం అడిగినది అని అడిగారు. అయితే మీకు ఏం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగాడు స్వామి, వీళ్ళు ఒక్కొటి చెప్పడం ప్రారంభించారు. “ఞాలత్తై యెల్లాం” భూమినంతా “నడుంగ” వణికించేట్టుగా “మురల్వన” ద్వని చేసేట్టి “పాలన్న వణ్ణత్తు” పాలవలే తెల్లగా స్వచ్చమైన కాంతికల్గిన, “ఉన్-పాంచజన్నియమే పోల్వన” నీ పాంచజన్యాన్ని పోలిన “శంగంగళ్” శంఖాలు కావాలి అని అడిగారు.
