రామేశ్వరం క్షేత్రంలో అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మికమైన విశేషం ఆలయంలోని 22 పవిత్ర తీర్థాలు. సముద్ర తీరాన ఉన్నప్పటికీ ఇక్కడ ఈ బావుల్లోని నీరు తియ్యగా ఉండటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. స్థలపురాణం ప్రకారం రావణ సంహారం అనంతరం శ్రీరాముడు శివారాధన కోసం దివ్య జలాలు కావాలని సంకల్పించగా సముద్ర దేవుడు ఈ 22 తీర్థాలను సృష్టించాడని విశ్వాసం. సముద్ర స్నానం తర్వాత ఆలయంలోని బావుల వద్ద ఒక్కొక్కటిగా స్నానం చేయడం సంప్రదాయం. ఆశ్చర్యం ఏమిటంటే ప్రతి బావిలోని నీటి రుచి, చల్లదనం, స్వభావం వేరుగా ఉంటుంది. ఈ 22 సంఖ్య రాముడి 22 బాణాలకు సూచికగా భావిస్తారు. మహాలక్ష్మీ నుంచి కోటి తీర్థం వరకు ప్రతి తీర్థం ఒక ఆశీర్వాదానికి ప్రతీక. ధనం, విద్య, ఆరోగ్యం, పాప విమోచనం, శాంతిని కలిగిస్తాయి. కోటి తీర్థ జలంతో స్నానం 22 తీర్థాల జలంతో సమానం చేసిన పుణ్యఫలాన్ని ఇస్తుందని చెపుతారు. సముద్రం పక్కనే ఉన్నా నీరు ఉప్పుగా కాకుండా మధురంగా ఉండటం ఈ క్షేత్ర దివ్యతకు నిదర్శనం అని భక్తులు విశ్వసిస్తారు. రామేశ్వరం యాత్రలో ఈ 22 తీర్థాల్లో స్నానం చేసి రామలింగేశ్వర దర్శనం చేస్తేనే యాత్ర సంపూర్ణమవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

