
ద్వారక గురించి పురాణాలు ఏమని వర్ణిస్తున్నాయంటే.. నగర ద్వారాలు బంగారం, వెండి, మణులతో అలంకరించబడ్డాయి. రాజమార్గాలు మెరిసే రత్నాలతో భవనాలు ఆకాశాన్ని తాకేలా ఉద్యానవనాల్లో కల్పవృక్షాలు.. సరస్సుల్లో కమలాలు, మణులు. శ్రీకృష్ణుని మహాలయం అయితే వైకుంఠాన్ని మించిన వైభవంతో ఉండేదని చెబుతారు.
ద్వారక అంటే కేవలం నగరం కాదు.. ధర్మం, శాంతి, సమృద్ధి, న్యాయం కలిసిన జీవన విధానం. ద్వారకలో జీవనం ఎలా ఉండేదో కూడా తెలుసుకుందాం. ద్వారకలో దొంగతనం, భయం, అన్యాయం వంటి వాటికి తావే లేదు.
పేదరికం లేదు. ప్రజలు ధర్మబద్ధంగా జీవించేవారు. స్త్రీలకు గౌరవం, పెద్దలకు సేవ, పిల్లలకు సంస్కారం.. ఇవి ద్వారకకు ప్రాణం. శ్రీకృష్ణుడు రాజైనా తండ్రిలా, స్నేహితుడిలా, గురువులా ప్రజల మధ్యే జీవించేవాడు. అంతటి వైభోగాన్ని అనుభవించిన ద్వారక ఎలా సముద్ర గర్భంలో ఎలా కలిసిపోయిందంటే.. శ్రీకృష్ణుని అవతార లక్ష్యం పూర్తయిన తరువాత యాదవ వంశంలో అహంకారం పెరిగింది. ఒక శాపం వల్ల యాదవులు పరస్పరం నాశనం చేసుకున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు భూమిని విడిచిన క్షణమే ప్రకృతి తన మార్గాన్ని మార్చింది. సముద్రుడు నెమ్మదిగా ముందుకు వచ్చాడు. ఒక్క రాత్రిలో ద్వారక నగరం మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇది విధి. ఇది యుగాంత సంకేతం.
